ఇలాన్ మస్క్-బయో గ్రఫీ

ఇలన్ మస్క్-బయో గ్రఫీ

అది జూన్ 1971 వ సంవత్సరం. దక్షిణాఫ్రికా గడ్డకు తెలియదు తను ఎలాంటి యోధుడికి జన్మనిచ్చిందో.  1971 వ సంవత్సరానికి తెలియదు, ఆ సంవత్సరం చరిత్ర పుటలలో శిలాక్షరాలుగా నిలిచిపోయే అదృష్టము చేసుకుందని. స్వయానా  అతడిని కన్న తల్లికి తెలియదు ఆమె ఒక ప్రపంచాన్ని శాసించే మాంత్రికుడికి, ఒక వీరుడికి జన్మనిచ్చిందని.

మరి ఆ వీరుడికి పుట్టుక తోనే  ఆ లక్షణాలు సంక్రమించాయా?అతడి జీవితం ఒక పూల బాటా? అతడిని ఐరన్ మ్యాన్ అనే చిత్ర నాయక పాత్ర కి ఇతడు ఎలా మూలాధారం అయినాడు? అసలు ఇంతకీ అతని పేరు ఏంటి..?

టెస్లా(TESLA) , స్పేస్-ఎక్స్ (Space X), సోలార్ సిటీ (Solar city) సంస్థలకు సి.ఈ.ఓ, ఇలాన్ మస్క్ 

ఒక్క సారి ఆ సమర యోధుని చరిత పుటలు తిరగేద్దాము రండి.

***********                    *************               **************

ఇలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్, ఒక ఇన్జనీరు, తల్లి మేయా మస్క్, మోడల్ మరియు డైటిస్ట్. మొత్తం ముగ్గురు సంతానంలో ఇలాన్ మొదటి సంతానం. అతడికి ఒక సోదరి- టో స్కా మస్క్, సహోదరుడు- కింబల్ మస్క్ ఉన్నారు. ఇలాన్ కు బడిలో తోటి పిల్లల దగ్గర చొరవగా మాట్లాడే గుణం లేదు. కానీ తెలివైన పిల్లవాడు. సహచర విద్యార్థుల దాడిలో చాలా సార్లు గాయ పడ్డాడు ఇలాన్. కానీ తన తల్లి తో ఆ సమస్యను పంచుకునే వాడు కాదు.

సమస్య మూలాలను విశ్లేషించటం ఇలాన్ కు వెన్న తో  పెట్టిన విద్య. ఎందుకంటే సాధారణంగా చిన్న పిల్లలందరూ చీకటిని చూసి భయ పడతారు,కానీ అతడు చీకటిని విశ్లేషించి “చీకటి అంటే కేవలం ఫోటాన్ ల యొక్క కొరతే, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, చీకటి అంటే వెలుగు లేకపోవటమే!!! అని తెలుసుకున్నాడు. అటు తర్వాత మరెన్నడూ అతడు చీకటిని చూసి భయ పడ లేదు. ఇది అతడి సమస్య విశ్లేషణకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

ఇంకొక్క ఉదాహరణ అతడి మేధా శక్తిని కళ్లకి కట్టినట్లు తెలిపే సంఘటన. బాల్యంలో అతడి మిత్రుడు “చంద్రుడు మనకు చాలా దూరంలో  ఉన్నాడు ఇలాన్” అంటే  ” కేవలం 1250000 మైళ్ళ దూరమే కదా? అన్నారట…మన బుల్లి మస్క్.

చిన్నతనంలో మస్క్ తన లోకంలో తను ఏదో ఆలోచించుకుంటూ ఉండే వాడట, అది చూసి తల్లి తండ్రులు ఇద్దరు అతడికి వినికిడి లోపం కాబోలు అనుకోని వైద్యులని సంప్రదించారట. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అతడు పగటి కలలు కంటున్నాడని…

ఆ పగటి కలలే ఇవాల్టి రోజున మనం చూస్తున్న స్పేస్ –ఎక్స్ (Space-X), టెస్లా సంస్థలు..

ఇలాన్  ఇప్పుడు కూడా అదే పగటి కలలు కంటూ ఉంటారట. కానీ ఇపుడు అతడి తల్లి  మేయా భయపడదు సరి కదా అతడు అలా ఉన్నాడంటే కొత్త ఆవిష్కృతమేదో ప్రపంచానికి చూపించ పోతున్నాడని గర్విస్తుందట ఆవిడా…

 

*****************                                 *******************                    **************

కెరీర్:  ఇలాన్ 10 వ ఏటా తల్లి తండ్రి విడి పోయారు. ఇప్పుడే ఇంజనీర్ అయిన తండ్రి వల్ల టెక్నాలజీ గూర్చి ఆసక్తి  కలిగింది అతడిలో.

కంప్యూటర్ మీద సరదాగా కూర్చొన్న వాడికి గేమ్ కోడింగ్ అంటే విపరీతమైన ఆసక్తి కలిగింది. అంతే 12 వ  ఏట కల్లా ‘బ్లాస్టర్ ‘ అనే వీడియో గేమును $ 500 /- అమ్మేసాడు.

1995 సంవత్సరం:  ఆ తర్వాత 17 వ ఏట ఆర్దిక శాస్త్రం, భౌతిక శాస్త్రం  అధ్యయనము కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, యు.ఎస్.ఏ. లో చేరారు, కానీ రెండవ రోజుకే  ఆయనకి ఇంటర్నెట్ టెక్నాలజీ మీదున్న మక్కువతో ఆ చదువుని త్యజించి జిప్-2 అనే సాఫ్ట్‌వేర్ సంస్థను, $28000/- మొదటి పెట్టుబడి, తండ్రి దగ్గర తీసుకొని సోదరుడు కింబల్ తో కలిసి స్థాపించటం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఆన్‌లైన్ సిటీ గైడ్లను దిన పత్రికలకు సరఫరా చేసే వారు మస్క్ సోదరులు. ఈ  సంస్థను 1999 లో

కమ్ పాక్  కంపూటర్స్ కి $307 మిలియన్లకు అమ్మివేయగా అతడికి అక్షరాల $22 మిలియన్ల లాభాలని తెచ్చి పెట్టింది. ఇందులో సగాన్ని ఎక్స్. కామ్ (X.com) అనే ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్ సంస్థ లో పెట్టుబడిగా పెట్టాడు ఇలాన్. ఈ కంపెని

అతి తక్కువ సమయములో ప్రత్యర్థి సంస్థ లో విలీనమయి ‘పే పాల్’ సంస్థగా రూపాంతరం చెందింది. ఇందులో అధిక శాతం షేర్లు ఇలానే దక్కించుకున్నాడు.

2001 సంవత్సరం: మస్క్ మెదడు లో ఎవరూ ఊహించని ఆలోచన తల ఎత్తింది. అదే మార్స్ అనే గ్రహం మీద చిన్న సైజు, గ్రీన్ హౌస్ ప్రయోగాత్మకమయిన స్థాపన. ఈ పగటి కళను నిజామ్ చేయటానికి 2002 సంవత్సరము లో ‘పే పాల్’ సంస్థను, ఈ-బే సంస్థ కు అమ్మేసి $ 180 మిలియన్ల తో మరో ముందడుగు వేశారు ఇలాన్. అప్పుడే అతడు రష్యా కు పయనం అయ్యారు, రెఫర్బిషెడ్ ఇంటర్ కాంటినెంటల్ బల్లి స్టిక్ మిసైల్స్ కోసం. ( అందరూ అనుకున్నట్టు సెకండ్ హాండ్ వస్తువులు కావు, కేవలం డెమో కి వాడినవి).అయితే ఇక్కడ రష్యన్లు చెప్పిన ధర ఇలాన్ తాహతుకి మించినది అవ్వటం తో ఆయన ఆలోచనలో పడవలసి వచ్చినది. కాదా మరి? ఒక్క రాకెట్టు ఖరీదు $8 మిలియన్లు, అది కూడా యూ.ఎస్. డాలర్లు…

కానీ మస్క్ మస్తిష్కానికి అది ఒక అడ్డంకి గా కనిపించలేదు. ఖర్చుకి భయపడి పోతే, యుద్ధము లో వెనకడుగు వేయటమే కదా.. అందుకే ఇలాన్ ఇంకొద్దిగా లోతుగా ఆలోచించి త్వరితగతిన ఒక నిర్ణయానికి వచ్చారు. అతడే సొంతంగా రాకెట్ల నిర్మాణాన్ని చేపట్టటం. అంతే కాదు ఆ ఆలోచన యొక్క ప్రణాళికను కూడా మాస్కో నించి వచ్చే తిరుగు ప్రయాణంలోనే రూపొందించేశాడు ఆయన. అది కూడా అందుబాటు ధరలో ఉండేలా .. ఊరికే అనుకోని వదిలేయలేదు మన ఇలాన్, అనుకున్నది చేసి చూపించాడు  మే 2002 లో $ 100 మిలియన్ల (యూ.ఎస్.డి) తో స్పేస్- ఎక్స్ సంస్థను స్థాపించాడు. వెనక్కి తిరిగి చూడకుండా.

 

అతడు కనిపెట్టిన చిన్న వ్యాపార రహస్యం ఒక్కటే, ఒక్క రాకెట్ నిర్మాణానికి ముడి సరుకు విలువ, అమ్మకం విలువలో 3 శాతం మాత్రమే. అప్పట్లో స్పేస్- ఎక్స్ సంస్థ ప్రయోగ ధరను 10 గుణింతంలో కుదించినా కూడా, సంస్థ 70 శాతం స్థూల సరిహద్దు ఆదాయాన్ని పొందగలదు.

కఠోర పరిశ్రమ, నిరంతర కృషి కూడా ముఖ్య  పెట్టుబడులే ఇలాన్ సంస్థలలో. సరిగ్గా 4 సంవత్సరాల  తర్వాత 2006 లో మొదటి రాకెట్ ను ప్రయోగించింది స్పేస్- ఎక్స్, అయితే దురదృష్టవశాత్తు ప్రయోగించిన 33 సెకండ్‌లకే రాకెట్ కుప్ప కూలి పోయింది. అయితే ఇలాన్ మస్క్ కుంగి పోలేదు. అలా జరిగితే  యోధుడని ఎలా అనగలము?తిరిగి 2007 లో, 2008 లో యేడాది నిడివి తో ప్రయోగించినా  అపజయాన్ని చవి చూసింది  స్పేస్- ఎక్స్ . ఈ ఓటములు అతడిలో పట్టుదలను మరింత పురికొల్పాయీ కానీ, నైరాశ్యానికి గురి చేయలేదు. 3 వ సారి కుప్ప కూలిన రాకెట్, సంస్థ ఆర్ధిక స్థితి గతులని పూర్తిగా చిన్నా భిన్నం చేసింది. ఇక మిగిలిన ఆర్ధిక శక్తి కేవలం నాలుగవ సారి ప్రయోగము కొరకు మాత్రమే.  ఈ దశ అతడి తెలివికి, స్థైర్యానికి ముఖ్యంగా సంస్థ భవిష్యత్తుకి ఒక అగ్ని పరీక్షే అని చెప్పాలి. ఆ సమయములో ఇలాన్ అనుకున్నది ఒక్కటే “నేను ఒడి పోలేదు, కేవలం 3 సార్లు లోతుగా నేర్చుకున్నాను.”

అంతే, 2008 : నలగవ రాకెట్ ఫాల్కన్-1 అనబడే రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించ కలిగింది స్పేస్- ఎక్స్. అవును అతడు చరిత్ర ను సృష్టించాడు.   ఒక ప్రైవేటు సంస్థ ద్వారా విజయవంతమైన మొట్టమొదటి ద్రవ ఇంధన రాకెట్ గా గుర్తించబడ్డది.

మూడు నెలలు తిరగకుండా ‘నాసా'( NAASA ) నించి బహుమతిగా $ 1.6 బిలియన్ల కాంట్రాక్టు ఇలాన్ కు లభించింది. నాసా అంతరిక్ష నౌకలకు బదులుగా,  స్పేస్- ఎక్స్ నౌకల ద్వారా ‘నాసా’ వ్యోమగాములను అంతరిక్షానికి చేర్చటమే కాంట్రాక్టు  అప్ప చెప్పబడిన ఉద్దేశం.

2011 : అత్యంత విస్నూతనమయిన, ప్రయోగాత్మక ఆలోచనను బహిరంగముగా ప్రకటించారు ఇలాన్. అదే, ఒక సారి ప్రయోగించబడ్డ రాకెట్లు పునర్వినియోగించ గలగటం. అందరూ ఒక్క సారి ఆశర్యపోయారు, ఇదెలా సాధ్యం? అవును ఎందుకంటే అప్పటి వరకు, ఒక సారి ప్రయోగించ బడ్డ రాకెట్లు పని పూర్తి అయ్యాక భస్మం అయిపోయేవి, వేరే గత్యంతరం లేదు.  కానీ ఇలాన్ ఆ ఖర్చుని నిమంత్రించాలని పట్టు పట్టాడు. అంతే భస్మానికి సిద్దమయిన రాకెట్ల తల రాతను మార్చి తిరిగి వ్రాశాడు-ఇలాన్. 2015 డిసెంబర్ లో, విజయవంతముగా ప్రయోగించబడ్డ రాకెట్లకు అంతే పదిలంగా పునర్వినియోగానికి యోగ్యత కలగ చేసి నిరూపించాడు, అంతరిక్ష మాన్త్రికుడు మస్క్. అలాగే మరో రాకెట్ ను మార్చి 2017 వ సంవత్సరము లో  రెండవ సారి ప్రయోగించి సురక్షితముగా తెచ్చుకోగలిగింది స్పేస్- ఎక్స్ సంస్థ. ఇలాన్ ఇదంతా ఎందుకు చేశాడో అర్థం అయింది కదా. కేవలం  ఒక్కో రాకెట్ నిర్మాణపు ఖర్చును తగ్గించటానికి మరియు రష్యా లో ఇలాన్  తాహతుకి మించిన రాకెట్ ఖరీదుని చెప్పినందుకు మాత్రమే….

ఈ పట్టుదలే అతడికి ‘ఐరన్ మ్యాన్’ అనే పేరును తెచ్చి పెట్టింది.

ఆగం డాగండి…అప్పుడే అయిపోలేదు.. ఇలాన్ ఘనా విజయాల పరంపర.. అతడు జీవితం అంతా కేవలం ఒక స్పేస్- ఎక్స్ సంస్థ కోసమే పోరాడాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసి నట్టే.. ఒక వైపు స్పేస్- ఎక్స్ సంస్థ ఉన్నతి కై పాటు పడుతూనే, మరో  పక్క  టెస్లా (TESLA) అనే ఎలక్ట్రిక్ కార్ సంస్థ చైర్మన్ గా, కుస్తీలు పడుతుండే వాడు.. బహుముఖ ప్రజ్ఞా శాలి అయిన ఇలాన్.

 

టెస్లా:ముందుగా ఈ సంస్థను స్థాపించింది, 2003 జూలై లో, మార్టిన్ ఎబర్ హార్ట్ మరియు మార్క్. ఫిబ్రవరి 2004 అత్యధిక శాతం పెట్టుబడిదారునిగా ఆ సంస్థ చైర్మన్ పదవిని చేపట్టారు మన ఇలాన్ మస్క్. ఈ సంస్థ యొక్క వ్యాపారోద్దేశ్యాన్ని 3 భాగాలుగా  విభజిస్తే –

1.అత్యంత సౌకర్యవంతమయిన, ఎక్కువ  సామర్ధ్యము ఉన్న స్పోర్ట్స్ కారు. మరియు ఇంధనం అవసరము లేకుండా పూర్తిగా బ్యాటరీ మీద నడిచే కారు.

  1. అది కూడా అప్పటికే ఆగ్రా స్థానాన్ని బి. ఎం.డబల్యు. మరియు మర్శిడీస్ కార్లకు ఏమి తీసిపోకుండా.
  2. అతి ముఖ్యమయిన అంశం, ప్రతి వినియోగదారుడు ఎదురు చూసే చౌక ధర. అవును మర్శిడీస్ ను తల తన్నే కారు చౌక ధరకే వస్తుందంటే ఎవరికి చేదు చెప్పండి.

ఏంటి ఆశ్చర్య పోతున్నారా ? ఇలాంటి పగటి కల అతడు కనటం, మనందరి ఉపయోగానికి తీసుకు రావాలను కోవటం, ఎవరికి ఉంటుంది అంతా ఓపిక, మెండయిన ఆశక్తి? కాబట్టే అతడు ఇలాన్ అయినాడు. ఇక అతడి ఆలోచన ప్రణాళిక రూపం దాల్చింది.

దాని ప్రకారం 2007 సెప్టెంబర్ కల్లా ‘రోడ్ స్టర్’  అనే ‘టెస్లా’ సంస్థ మొదటి కారు ఉత్పత్తి మొదలవ్వాలి. కానీ ఇక్కడ కూడా అతడి అకుంఠిత దీక్ష కు పరీక్ష ఎదురయినది. ఇలాన్ అంచనా ప్రాకారము ఒక్క కారు ఉత్పత్తి ధర $65000/-. కానీ లోతుగా పరిశీలించిన సంస్థ నిర్వాహకులు ఉత్పత్తి ధరను $140,000 గా తేల్చారు. అంటే లెక్క ప్రకారం ఒక కారు ఉత్పత్తి, అమ్మకం కన్నా ముందే  నష్టము వాటిల్లే ప్రమాదమున్నది.  ఈ ప్రమాదకరమయిన దారి కూడా ఇలాన్ కు సరికొత్త పుంతలను అన్వేషించటానికి దోహద పడింది. అదే ఇలాన్, కారు నిర్మాణానికి , ఉత్పత్తికి కావల్సిన పరిశోధన లో స్వయముగా దూకటము.

ఇలాన్ టెస్లా సంస్థ కి చైర్మన్ అయినా కూడా ఒక సాధారణ మెకానిక్ అవతారాన్ని ఎత్తి,  కారు యొక్క ‘ప్యానెల్ ఫ్యాబ్రికేషన్’ ను పరిశోధించి అందులో ‘టెస్లా’ కు కావల్సిన ఉపకరణాలు లేవు అని తేల్చుకున్నాడు. కానీ అప్పటికే ఇలాన్ తో సహ ఇతర పెట్టుబడి దారులు కలిసి $100 మిలియన్లు పెట్టుబడిగా పెట్టాడు. కానీ కార్ ‘నమూనా’ చూపించటానికి కూడా వీరి దగ్గర ఒక్క కారు కూడా లేదు. మరో వైపు స్పేస్-ఎక్స్ సంస్థ కూడా అపజయాలను చవి చూస్తోంది ఆ దశలోనే.

2007 లో టెస్లా యొక్క 8 మిలియన్ల ముఖ్యమయిన షేర్లను, కామన్ షేర్లు గా ప్రకటించారు ఇలాన్, అటు పిమ్మట మార్టిన్ ను సి.ఈ.ఓ. పదవి నించి తప్పించి, ఆప ధర్మపు సి.ఈ.ఓ. గా మయిఖేల్ ను నియమించారు. మార్టిన్ తో పాటే మార్క్ కూడా పదవి నించి తప్పుకున్నారు.

మయిఖేల్ వెంటనే టెస్లా కార్ నాణ్యతను బేరీజు వేసి ట్రాన్స్ మిషన్, ఏర్  కన్డీషన్, సీట్ల నాణ్యతా లోపాలను ఏకరవు పెడుతూ, ఈ మెయిల్ ద్వారా, ‘తను అనుకున్న దాని కన్నా తీవ్ర స్థాయిలో లోపాలున్నట్టు’ ఇలాన్ కు తెలిపారు. అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలు మరియు మరికొందరు కార్ల విశ్లేషకుల బృందం విలువ లేనిదిగా , ఒక అసంభవమైన ప్రాజెక్ట్ గా అభివర్ణించాయి.

కానీ ఇవేవీ మస్క్ కి విన బడటం లేదు, కేవలం కంబషన్ ఇంజిన్ ఎలా ప్రపంచాన్ని ఇంధనం మీద ఆధార పడేలా చేస్తుందో,  తద్వారా వాయు కాలుష్యానికి ఎలా దోహద పడి వాతావరణ మార్పు కి దారి తీస్తుందో, ఇది మాత్రమే అతడి మదిని తొలి చేస్తోంది.

అందుకు టెస్లా కార్ మాత్రమే సమాధానం ఇవ్వగలదు అని అతడు బలంగా నమ్మాడు కానీ అలాంటి విపత్కర పరిస్థితి లో కూడా టెస్లా ని ఒక అపజయముగా భావించలేదు.

2007 డిసెంబర్ లో డ్రోరీని సి.ఈ.ఓ‌. మరియు ప్రెసిడెంటుగా నియమించింది టెస్లా సంస్థ.

2008 నాటికి ఉత్పత్తి సమస్యల నించి టెస్లా-రోడ్ స్టర్ కార్ బయట పడింది. ఇహ అక్కడ నించి మస్క్ కి వందల సంఖ్యలో ఆర్డర్లు వచ్చి పడ్డాయి, $109000 ఖరీదు కల టెస్లా-రోడ్ స్టర్ కార్ కోసం. మొదటి మెట్టను అధిరోహించింది టెస్లా సంస్థ.

ఇక రెండవ మెట్టు మోడల్-ఎస్ కోసం నడుము కట్టాడు ఇలాన్. మరొక $100 మిలియన్ల అవసరం పడింది. కానీ ఆ సంవత్సరమే (2008)  లోనే స్టాక్ మార్కెట్ తీవ్ర స్థాయిలో పడి పోయింది. ఆ ప్రభావం తో బ్యాంకు బ్యాలెన్సు$5 లక్షలకు దిగ జారింది.

మరో వైపు నించి మీడియా, మరి కొంత మండి విశ్లేషకుల విమర్శనాస్త్రాలు ఇలాన్ సంస్థ ల మీద దాడి చేస్తున్నాయి. అప్పటికి ఇలాన్ వ్యక్తిగత ఆస్తుల విలువ $20 మిలియన్లు, అక్కడితో అతడు అన్నిటికి స్వస్తి చెప్పి వదిలేసిన అతడి విలాసవంతమయిన జీవితానికి ఎలాంటి డోఖా లేదు. అయినా తల పెట్టిన కార్యాన్ని మధ్యలో వదిలి వేయటం పురుష లక్షణం కాదని ఇలాన్ కి తెల్సు.

అంతే అతనిలోని వ్యాపార మాంత్రికుడు నిద్ర లేచాడు. మోడల్-ఎస్ ఉత్పత్తికి కావల్సిన పెట్టుబడి రోడ్ స్టర్ లాభాల నించి రాబట్టాలని నిర్ణయించాడు. ఆ లాభాన్ని ‘డయామలర్’ స్మార్ట్ కార్ల సంస్థ కు ఉపయోగపడే బ్యాటరీలు సరఫరా కు వినియోగించాలి. మరి కొంత పెట్టుబడికి గవర్నమెంటు సహకారంతో మోడల్-ఎస్ ను ఉత్పత్తి చేయాలి. ఇపుడు ఇలాన్ సి.ఈ.ఓ. గా సంస్థ పగ్గాలు చేపట్టాడు. $40000 మిలియన్ల కు గాను ఇతర పెట్టబడు దారులని కోరాడు. తన సొంత ఆస్తులను సైతం టెస్లా మాడెల్-3 కు వినియోగించాడు ఇలాన్. తన వ్యక్తిగత ఖర్చులకు స్నేహితుల మీద ఆధార పడ్డ పరిస్ధితి. అయినా మన మాంత్రికుడికి భయం కలగ లేదు. అనుకున్నట్లు గానే అతడి కల ఫలించింది.  డయామలర్ సంస్థ ఇలాన్ ను నమ్మింది.1000 బ్యాటరీల సరఫరా కోరుతూ ఒప్పందాన్ని కుదరటం,$40 వేల మిలియన్ల పై చిలుకు వచ్చి పడటం చక చక జరిగి పోయినాయి.

అప్పటి ఒబామా ప్రభుత్వం కూడా $465 మిలియన్ల అప్పును ఎడ్వాన్సడ్ టెక్నాలజీ వెహికల్స్ మ్యానునుఫాక్చరింగ్ లోన్  ప్రోగ్రామ్  పధకం రూపేణా మంజూరు చేసింది. ఇందుకు గాను అప్పటి ప్రెసిడెంట్ నామినీ, ఒబామా ను దుయ్య పట్టారు. ఓటమి వీరులనే ఒబామా ఏరి కోరి ఎంచుకుంటారు అని బహిరంగంగా విమర్శించారు.

 

మార్చి, 2009 :టెస్లా మోడల్-ఎస్ ను ఉత్పత్తి మొదలయి, విడుదల కూడా అయింది. అనుకున్న దాని కన్నా ఎక్కువ గానే అందరినీ సమ్మోహ పరిచింది మోడల్-ఎస్. నవ్విన నాప చేను పండింది. విమర్శకులకు కేవలం తన విజయ పతాకాన్ని ఎగుర వేస్తూ సమాధానం ఇచ్చారు ఇలాన్. అంటే కాకుండా 2013 మార్చి  22 న, వడ్డీ తో సహ గవర్నమెంటు దగ్గర చేసిన అప్పు తీర్చామంటూ ఇలాన్ స్వయంగా ప్రకటించారు. బహుశా విమర్సుకులకు నమ్మటానికి కొంత సమయం పట్టి ఉంటుంది ఎందు కంటే గవర్నమెంటు బాకీని వడ్డీ తో సహా తీర్చిన మొట్టమొదటి కార్ల సంస్థ టెస్లా మాత్రమే…

అక్కడి తో ఆగి పోకుండా సంస్థ మోడల్-ఎక్స్ ఎస్.యూ.వి. కార్ ను 2015 లో విడుదల చేసింది. అటు తర్వాత మోడల్-3 ని $35 వేల విలువ చేసే ఎలక్ట్రిక్ కార్ ను ఆవిష్కరించింది కూడా.

2017: టెస్లా సెమీ ట్రక్ ను తయారు చేసింది. అన్తే గాక రోడ్ స్టర్ prototype కారును విడుదల చేసింది. ఈ కార్ విసిస్టత ఒక్క మాటలో చెప్పాలంటే లాస్ ఏంజిల్స్ నించి, సాన్ ఫ్రాన్సిస్కో కి ప్రయాణం మధ్యలో బ్యాటరీ రీఛార్జీ చేయాల్సిన అవసరము లేదు. డీసీల్ మరియు ఇతర ఇంధనాలా మీద ఆధార పడే కార్ల సంస్థలకు ఇది మింగుడు పడని సమస్య.

ఇన్ని సాధించిన ఇలాన్ ఎలా వీటిని సాధించ కలిగాడు. అందరికీ ఉండేవి 24 గంటలే కదా మరీ అంటే, ఇలాన్ వారానికి 80 నుంచి 100 గంటలు పరిశ్రమ చేయటమే దానికి కారణం అంటారు. అంతే కాకుండా బాల్యం నించి అతడికున్న పుస్తక పఠన అభ్యాసన (కార్టూన్స్ నించి వికీపీడియా వరకు ). అన్నిటి కన్నా ముఖ్యంగా ఓటమిని ఒప్పుకోని మనస్తత్వం ఆయనను యోధుడు అనే పదానికి యోగ్యుడిని చేసింది. విపత్కర పరిస్థితులలో కూడా ఆయనకున్న సానుకూల ధోరణి ‘పెట్టని ఆభరణం’ గా చెప్పవచ్చు. పరిస్థితి కి అనుగుణంగా ఎప్పటి కప్పుడు ప్రణాళికల మార్పు, అందుకు తగ్గ లోతైన పరిశోధన, తన స్థాయిని కూడా లెక్క చేయకుండా ఒక సాధారణ వ్యక్తి గా తన వంతు బాధ్యత ను నిర్వర్తించటం. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చిట్టానే తయారు అవుతుంది మన ఇలాన్ విజయ రహస్యాల జాబితాలో.

అందరినీ అబ్బుర పరిచే ప్రశ్న ఇంత తక్కువ వ్యవధిలో ఇంత జ్ఞానార్జన ఎలా చేయగలడు అని. దానికి కూడా ఇలాన్ చాలా సులువైన మంత్రాన్ని సూచిస్తారు. “ఎవరయినా సరే దేనినయిన చదివేటపుడు లేక నేర్చుకునే దశ లో ఉన్నపుడు ఆ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకండి. ఎలా ఒక చెట్టును గూర్చి చెప్పాలంటే దానిని వివిధ భాగాలుగా విభజిస్తామో (వేర్లు, కాండము, కొమ్మలు ఆ తరువాత ఆకులు, పువ్వులు, కాయలు, పళ్లు ) అలాగే మీరనుకున్న పాఠాన్ని కానీ అలాగే భావించండి, ముందు చెట్టు మెదలు , వాటి పొడవాటి కొమ్మలు గూర్చి తెలుసుకోండి. ఆ తరువాత ఆకులు, మొగ్గలు, పువ్వులు గూర్చి తెలుసుకోండి.

అలా కానపుడు  మీకున్న తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను సంగ్రహించలేరు” అంటారు ఇలాన్ .

మరీ ఆయన వ్యక్తిగత జీవితం గడపరా? ఎలా వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని సమతుల్యత తో నిర్వహిస్తారు. ఇలాన్ కూడా మన లాంటి సాధారణ మనిషే. కాకపోతే తన సమయాన్ని రెండు వైపులా తన ప్రణాళికలకు తగ్గట్టూగా  కేటాయించుకుంటారు. కాబట్టే ఒక వైపు టెస్లా సంస్థ ఆర్ధిక కొరత సలుపుతున్నాకూడా భార్య జస్టిన్ విల్సన్ తో విభేదాలు వచ్చి విడిపోవాల్సి వచ్చినా  కూడా నిభాయించుకు రాగలిగారు  ఇలాన్.

జస్టిన్ విల్సన్ ఇలాన్ కు మొదటి భార్య. ఈవిడ 1972 లో జన్మించారు. ఇలాన్ ను మొదటి సారిగా క్వీన్ యూనివర్సిటీ, కింగ్ స్టన్ లో కలిశారు. ఆ పరిచయం 2000 సంవత్సరము లో వివాహముగా మారినది. జస్టిన్ ఒక రచయిత్రి.  వారిరువురికి అయిదుగురు సంతానము కలుగగా అందులో అందరూ మగ సంతానము కావటం విశేషము.  వారు డామియాన్, గ్రిఫిన్, కై, సక్సాన్,గ్సేవియర్.

వీరు కాకుండా నెవెడా ఆలెక్సాండ్రా అనే మగ బిడ్డ పుట్టి, 10 వారాలు తిరిగే లోపు సిడ్స్ (SIDS-SUDDEN INFANT DEATH SYNDROME) అనే వ్యాధి తో మరణించాడు. జస్టిన్ విల్సన్ తో ఉన్న వైవాహిక జీవితం 2008 తో ముగిసిపోయింది. ఇలా ఎన్నో ఒడిదుడుకులను పంటి బిగువుతో అధిగమిస్తూ తన లక్ష్యాలను చేరుకున్నాడు ఇలాన్. మాజీ భార్యకు ఇలాన్ ఇచ్చిన భరణం అత్యంత ఖరీదు అయినది. $2 మిలియన్ల నగదు, నెలకి $80,000/-17 ఏళ్ల వరకు పిల్లల పోషణకు సహకారం, టెస్లా రోడ్ స్టర్.

ఆ తర్వాత  ఇలాన్ 2008 లోనే తల్లులహ్ రిలేస్ ను ఒక క్లబ్ లో కలిశారు మొదటి  సారిగా. 2010 లో ఆమెను వివాహమాడారు ఇలాన్. కానీ 2012 లో ఆమెకు విడాకులను ఇచ్చి $16 మిలియన్‌లను భరణంగా ఇచ్చారు. కానీ మళ్ళీ మరుసటి సంవత్సరానికే ఆమెను మరలా చట్ట పరంగా వివాహమాడారు. కానీ మళ్ళీ  డిసెంబర్ 2104 నాటికి విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్ళి ఆ పై సంవత్సరములో ఆ ఆలోచన ను ఉపసంహరించుకున్నారు. ఇలాన్ అయిదుగురు సంతాన పెంపకపు బాధ్యతలో తల్లులహ్ రిలేస్ కూడా బాధ్యత వహించటం ఇక్కడ గమనార్హం, మెచ్చుకోవాల్సిన అంశం.

ఇలాన్ కూడా కేవలం తన వృత్తి నియమాలే కాకుండా తన పిల్లల చదువు కోసం కూడా అత్యంత శ్రద్ధను ప్రదర్శించారు. ఎంతగా అంటే ఏకంగా సొంత బడిని కట్టిచ్చారు తన సంతానానికి. ఐతే ఇక్కడ అన్నీ బళ్ళల్లో చెప్పినట్లు అన్నీ సబ్జెక్ట్లను మూస పోసిన విధానాలలో చెప్పరట. అలా చేస్తే ఇలాన్ భావాలకు విరుద్ధమట. అందుకే పిల్లల యొక్క తెలివితేటలను బట్టి, వారి అభిరుచులను బట్టి పాఠాలను చెప్తారాట. అవి సైన్సు కావచ్చు, సంగీతం కావచ్చు, కానీ అన్నీ సబ్జెక్ట్లను మాత్రం బలవంతముగా పసి పిల్లల మీద రుద్దకూడదు అంటారు ఇలాన్.

**********                  *************                    *****************

ఎన్నో ఆటుపోట్లు,ఎన్నో విమర్శలు, ప్రత్యర్థులు, వ్యక్తిగత సమస్యలు అన్నిటినీ అధిగమించి తనకంటూ చరిత్రలో ఒక నిర్దిష్టమయిన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ఇలాన్. కాబట్టే ఐరన్ మ్యాన్ అనిపించుకున్నాడు.

“ఐరన్ మ్యాన్” అనే చిత్రానికి మస్క్ జీవితమే ఒక ప్రేరణ. ఈ చిత్ర నిర్మాణ దశలో ఉండగా రాబర్ట్ ని అత్యంతముగా ఇలాన్ ప్రేరేపించారని స్వయముగా ఆ చిత్ర దర్శకులు తెలిపారు.

కొంత మంది అతగాడిని ‘హాఫ్ ప్లే బాయ్’ , ‘హాఫ్ స్పేస్ కౌ బాయ్’  అని కూడా అంటారు.

ఇపుడు నేను చెప్పిందoత సముద్రం లాంటి ఆయన ప్రయోగాల జాబితాలో కొన్ని నీటి బిందువుల గూర్చి,  జీవిత ప్రయాణంలో ని కొన్ని పేజీలు గూర్చి మాత్రమే, ఒక్క రోజులో చదివి ఆకళింపు చేసుకోటానికి ఆయన సాధారణ మనిషి కాదు కదా.. ఇలాన్ మస్క్ మరి..

భవిష్యత్తులో ఆయన జీవిత ఆశయమైన “ మార్స్” ప్రయోగము విజయవంతమవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.

 

*************                              ******************                     ****************

 

3 Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s