హృదయ స్పందన

“షటప్ప్ తపస్వినీ! నేను మూడేళ్లుగా ఆ స్థలం ఒక ఎమ్యూస్మెంట్ పార్క్ కోసం ప్లాన్ చేస్తున్నాను. ఇలా నాకు అడ్డు పడటం ఏం బాగోలేదు.”

“కానీ రిషి అన్నయ్య! అదే స్థలాన్ని నేను అనాధ ఆశ్రమానికి ఉపయోగించాలని నాన్న గారిని కూడా ఒప్పించాను, అందుకే ఆయన విల్లులో నా పేర్న వ్రాసారు, ఇల్లు మొత్తం నువ్వే తీసుకో, నాకు వద్దు.”

“నువ్వేం చెప్పావో, ఆయనెందుకు వ్రాసారో నాకు తెలీదు, నాకు నువ్వు రేపొద్దున కల్ల నా పేర్న ఆ స్థలాన్ని తిరిగి వ్రాసిస్తున్నావ్, అంతే.” అని విస విసా   వెళ్ళిపోయాడు రిషి.

*************************************************************************

ఉదయం 9 గంటలు:

తపస్వినీ గదికి, విల్లు కాగితాలు తీసుకొని వచ్చిన రిషికి, కిటికీ నుంచి కిందకి దుప్పట్లతోనూ చీరలతోనూ అల్లిన తాడు వేలాడుతూ కనబడింది. పక్కనున్న గోడకి ఒక ఉత్తరం అతికించి ఉన్నది.

“అన్నయ్య, ఆశ్రమం కట్టాలనే ఉద్దేశ్యం నా ఒక్కదానిదే కాదు, చనిపోయిన అమ్మది కూడా. కనుక ఈ ఇల్లు  మొత్తం నువ్వే తీసుకో. నన్ను ఇంతకు మించి ఒత్తిడి చేయకు. క్షమించు!”

ఉత్తరం చించి రిషి నేల కేసి కొట్టి ఫోన్  చేశాడు ” బాబాయ్, చెల్లి పారిపోయింది, విల్లు కాగితాలతో   సహా”!!!

**************************************************************************

కూర్గ్: నేలని తాకీ తాకనట్లు మురిపించి దోబూచులాడే మబ్బులు, ప్రకృతి కాంతకు ఆకు పచ్చటి చీరను చుట్టినట్లు, ఎక్కడ చూసినా చెట్లు. ఇక్కడ సూర్యుడు బద్దకస్తుడు, 24 గంటలు వరుణ దేవుడు ఆన్ డ్యూటీ లో ఉంటాడు.

రెండు రోజుల నించి ఎన్నో బస్సులు మారి, చివరికి కూర్గ్ చేరుకొని వర్షపు చినుకులకి ఒక చెట్టు కింద నిలబడింది తపస్వినీ. చినుకలు తడవకుండా డాక్యుమెంట్స్ చూన్నీ తో కప్పి బిక్కు బిక్కు మంటూ నిలుచున్నది ఆమె.

ఇంతలో ఒక వ్యక్తి  సైకిల్ మీద వచ్చి ఆమెను ” హాయ్” అంటూ పలకరించాడు. సైకిల్ నిండుగా పచ్చటి ఆకులతో, పూవులతో నింపుకొని వన రాజులా కనబడ్డాడు ఆ వర్షపు చినుకుల్లో ఆమెకు అతడు.

జుట్టు చెదిరిపోయి, ఆకలి దప్పులతో పెదవులు ఎండిపోయి, బట్టలు మాసిపోయి, ప్రయాణపు బడలికతో నీరసంగా వున్న ఆమె మౌనంగా ఉండటం చూసి ” నా పేరు పాణి, మీకు ఏమన్నా సహాయం కావాలా?” అంటూ ఆమెను అడిగాడు.

ఆమె మౌనంగా అతడిని అనుసరించటం తో, ఆమె గూర్చి అర్థం చేసుకున్న అతడు ముందుకు అడుగులు వేశాడు.

కొంత దూరంలో ఉన్న  బౌద్ధుల మఠంలో  ఆమెను వదిలి వెళ్ళాడు పాణి.

వారు ఆమెను మంచి మనస్సుతో ఆహ్వానించి ఆశ్రయం కల్పించారు. అక్కడున్న పదేళ్ళ చిన్న మాంక్ ఆమెను విచిత్రంగా చూస్తూ ”  నీ పేరేంటి” అన్నాడు సైగలు చేస్తూ.

ఆమె చిన్నగా అతడి బగ్గలను ముద్దాడింది. ఆమె చేయి పట్టుకొని చిన్న మాంక్ గదిలోకి తీసుకెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు.

*************************************************************************

మరునాడు ఉదయం కిటికీ లోంచి సూర్యుని లేలేత కిరణాలు ఆమె కంటిని చిన్నగా స్పృశించగా నిద్ర లేచింది ఆమె.

చిన్న మాంకు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఆమె చేతిలో ఒక పొగలు కక్కుతున్న వేడి పానీయం  కల ఒక మట్టి పాత్రను ఉంచి వెళ్ళిపోతు “టైమ్ ఎంతో తెలుసా!” అన్నట్లు చూశాడు.

ఆమె గడియారం వంక చూసి హమ్మో!! అనుకుంటూ దుప్పటి విసిరి కొట్టి వాష్రూమ్ లోకి పరుగెట్టింది తొమ్మిది అవ్వటంతో.

ఆమె తిరిగి వచ్చే సరికి చిన్న మాంక్ స్థలం దస్తావీజులను పై నించి కిందకి అర్థం కాక పోయినా చదువుతూ అవస్థ పడుతున్నాడు.

ఆమె వాటిని సుతారంగా అతడి చేతిలో నించి తీసుకొని “ఇవి అనాధ ఆశ్రమానికి  నేనిచ్చే స్థలం తాలూకు విల్లు” అని సైగలతో వివరించింది. ఆమె చేస్తున్న ఆ పనికి ఆ పిల్ల బౌద్ధుడు తన చిన్న కళ్ళను మరింత చిన్నవి చేసి నవ్వుతూ, తన పెద్ద మనస్సుని అంతా తన చేతుల్లోకి పరిచేస్తూ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు.

“నీకు సుందరమైన బాహ్య ప్రపంచాన్ని చూపిస్తాను పదా”, అని చేయి పట్టి లాక్కెళ్ళాడు బయటకు, ఆ పసి మనసు ఆమె చేసే గొప్ప పనికి అలా బహుమతి ఇవ్వాలనుకున్నది.

కొలనులు, జలపాతాలు, అడవులు చూబిస్తూ కొస మెరుపుగా, ఆమె పట్ల తన కళ్ళల్లో అభిమానాన్ని కూడా చూబిస్తున్నాడు చిన్న మాంకు.

తిరిగి వచ్చే సరికి పొద్దు వాలిపోవటంతో నెమ్మదిగా అడుగులు వేస్తున్న ఆమెకు మసక వెలుతురులో, పెద్ద స్థలంలో ఒక ఇల్లు చాలా కళాత్మకంగా కనబడటంతో ఆగిపోయి చూస్తూ ఉండిపోయింది.

చిన్న మాంక్ అర్థం చేసుకొని ” పాణి ..పాణి ” అంటూ “అతడి ఇల్లు” అని సైగలతో చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. పాణిని ఆట పట్టించటానికి అతడు తపస్వినికి చప్పుడు చేయొద్దని  సందేశం ఇచ్చి పాణిని వెతకనారంభించాడు.

ఇద్దరు ఇల్లంతా వెతికినా ఎక్కడా అతడు కనిపించకపోవటం తో , పెరట్లోకి వెళ్ళారు వారిద్దరు.

అక్కడ పాణి సాయం సంఝా కిరణాలను- కళ్ళు మూసుకొని, తన రెండు చేతులను సమాంతరంగా చాపి  ఆస్వాదిస్తూ ఉండగా, చిరు గాలికి అతడి ముంగురులు నుదుటిని ముద్దాడుతున్నాయి. ఒక తుంటరి పావురం అతడి ముంజేతి  మీద వాలి చక్కిలి గిలి పెట్టటంతో చప్పున కళ్ళు తెరిచి చూడగానే, ఎదురుగా తపస్వినీ కనిపించింది అతడికి.

‘సాయం కాలం అవ్వటంతో, ఈ వన కన్యను నాకు ఇచ్చి వెళ్ళాడా సూర్యుడు?’ అనుకోని చూస్తూ ఉండిపోయాడు ఆమెను పాణి. ‘నిన్నటి రోజు ఎలా ఉంది…! ? ఇవాళ కడిగిన ముత్యంలా వుంది’ అనుకుంటూ ఉండగా, చిన్న మాంకు  అతడిని కుదిపి కళ్ళతోనే ఎక్కిరించి “ఏంటి సంగతి?” అని అడిగాడు.

పాణి తటపటాయిస్తూ ఆమెను ” ఆశ్రమం లో అంతా బానే ఉంది కదా”? అని అడిగాడు.

“మీ కుటీరం చాలా బాగుంది, ఇక్కడ మీరేం చేస్తారు”? అన్నది.

“ఇక్కడ అడవిలో ఆకులతో, బెఱళ్లతో మూలికలు చేసి కావల్సిన వారికి పంపుతాను ఉచితంగా”

“మీ టాలెంట్ వృధా అయిపోవట్లేదా?”

అలా అడుగుతున్నప్పుడు ఆమె బుగ్గలు కదులుతున్న తీరు చూసి నవ్వుకుని అతడు “రండి కాఫీ కల్పుతాను” అని లోపలికి తీసుకెళ్ళాడు.

“చిన్న మాంక్ కి  బూస్ట్ కలపండి” అన్నది టీ. వి ఆన్ చేస్తూ తపస్వినీ.

అతడు ఆమె అమాయకత్వం చూసి నవ్వుకున్నాడు, తనకి సహాయంగా రాకుండా హాల్లో నే కూర్చొని ఆర్డరు వేస్తున్నందుకు.

“సూర్యుడి తో, ఒళ్ళు మర్చిపోయి  ఏదో చెప్తున్నట్లు అనిపించింది నాకు, నిజమేనా?”  అని టి.వీ. చూస్తూనే అడిగింది ఆమె.

“నా సుఖాలు కష్టాలు ఆయనతో, ఆ సమయంలో చెప్పుకుంటాను” అన్నాడు అతను కిచెన్ లో నించే.

చిన్న మాంక్ లోపలికి వచ్చి ఆమె ఆశ్రమం గురించి అతడి చెవిలో చెప్పి వెళ్ళి పోయాడు, స్టవ్ మీద పాలు, పాణి మనసులో ఆమె మీద  ప్రేమ ఒకే సారి పొంగిపోయినాయి.

***************************************************************************

“బాబాయ్! తపస్వీ ఎక్కడా కనిపించట్లేదు, వెతికి వెతికి అలసిపోయారు మన వాళ్ళు. నెల రోజులు అయిపోయింది అది వెళ్ళిపోయి ఇంట్లో నించి” అన్నాడు రిషి.

“కంగారూ పడకురా… చిన్న పిల్ల నీ మీద కోపంతో వెళ్ళిపోయింది. తిరిగి వస్తుంది” అన్నాడు ఆయన తీరిగ్గా పేపరు చదువుకుంటూ..

*******************************************************************************

చిన్న మాంక్ తో కలిసి రోజు అడవిలో కాసేపు గడపటం అలవాటు అయిపోయింది తపస్వినికి.

ఈ రోజు  మూలికల కోసం వచ్చిన పాణి కూడా వాళ్ళని అడవిలో కలిశాడు.

“ఈ మూలికలతో మీకేం వస్తుంది, పైగా మీకు ఇందులో లాభం కూడా ఏమి లేదు”  అన్నది విచిత్రంగా చూస్తూ..అతడిని.

అతడు ఆమెను చూసి చిరు నవ్వు నవ్వి “నువ్వు మాత్రం అది కాదా చేసేది” అనుకోని మనసులో, కొలను లో  నించి తామరలు తెచ్చి ఇచ్చాడు ఆమెకు.

చిన్న మాంక్ వారిద్దరిని చూసి ముసి ముసి నవ్వులు నవ్వి,  ఆ నవ్వులను తన చిన్ని అర చేతుల్లో బంధించలేక ఇబ్బంది పడ్డాడు. చిన్న మాంకు ను చూసిన తపస్వినీ చిరు కోపంతో ఆ పూవులను తిరస్కరించి ” తామరలు చిన్నప్పుడు అమ్మ, అమ్మవారి గుడిలో ఇచ్చేదీ,” అన్నది పాణికి కోపం వచ్చిందని భావించి.

అతడు ఆమె తిరస్కణను కూడా స్వీకరిస్తూ, ఆ తామరలను సైకిలు ముందు టబ్ లో  పొదవి పెట్టుకున్నట్లు సర్దుకుని “పక్క వారి గురించి ఆలోచించే వారు కూడా అమ్మవారితో సమానమే తపస్వినీ” అని వెళ్ళిపోయాడు.

అతడి సంస్కారానికి, తిరస్కారాన్ని కూడా మృదువుగా స్వీకరించే గుణం చూసి ఆమె “నేను చాలా నేర్చుకోవాలి ఇంకా” అనుకున్నది.

********************************************************************************

తపస్వినిని  వెతుక్కుంటూ ఆమె అన్న వచ్చాడు మాంకుల ఆశ్రమానికి, “తపస్వినీ చాలా బాధ పెట్టావు. ఇలా పారిపోతే పట్టుకోలేను అనుకున్నావా? విల్లు తిరగ వ్రాసి ఇవ్వు” అన్నాడు.

“కుదరదు అన్నయ్య, ఇది నా ఆశయం మాత్రమే కాదు, అమ్మ ఆశయం కూడా.”

“అంత ఖరీదు చేసే స్థలాన్ని దారిన పోయే వాళ్ళకి  ఇవ్వాలా నేను?” అంటూ కొత్త విల్లు పత్రాల మీద బలవంతంగా ఆమె చేయి పట్టుకొని సంతకం చేయించాడు రిషి.

మిగిలిన పెద్ద మాంకులు అందరూ అడ్డు పడినా,  పాత విల్లు కాగితాలు చించేశాడు రిషి. అడ్డు వచ్చిన తపస్వినిని ఒక్క విసురుతో తోశేశాడు.

ఇదిలా జరుగుతుండగానే చిన్న మాంకు పాణిని పరుగున వెళ్ళి  పిలుచుకు వచ్చాడు.

పాణి కి ఎవరు చెప్పకుండానే రిషి ఎవరో అర్థం అయింది, ” ఆమె చేస్తున్న పనికి చేయూతని ఇవ్వాల్సింది పోయి అడ్డుపడుతావా?” అని కొత్త విల్లు పత్రాలు లాక్కొని చించేశాడు.

కట్టలు తెంచుకున్న కోపంతో రిషి అతడి చెంప చెళ్లుమనిపించి అవమానించాడు.

కోపాన్ని దిగమింగిన పాణి, “ఇదిగో బ్లాంక్ చెక్కు. నీకెంత కావాలో ఆ స్థలం ఖరీదుగా వ్రాసుకో, నేను కొనుక్కున్నాను అనుకో” అన్నాడు.

సంభ్రమాశ్చర్యాలతో రిషి, “ఆ స్థలం ఖరీదు అంత చేయదు, నువ్వు ఎందుకు  నా చెల్లికి సహాయం చేస్తున్నావు”? అన్నాడు.

” నీకావాల్సింది దక్కింది కదా? ఇంకా వెళ్ళు” అని అన్నాడు తిరిగి నిశ్చల స్ధితికి చేరుకొని.

చెల్లెలి గూర్చి ఆలోచించకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు రిషి.

తన అన్న జుగుప్సాకరమయిన బుద్ధికి సిగ్గు పడి లోపలికి వెళ్ళిపోయింది తపస్వినీ, ఆమెనే అనుసరించి చిన్న మాంకు వెళ్ళిపోయాడు.

ఆమె పరిస్దితిని  అర్థం చేసుకున్న పాణి ఆమె దగ్గరకు వెళ్ళి ” ఇక మీరు నిశ్చింతగా ఆశ్రమం కట్టడం మొదలెట్టండి” అని వెళ్ళిపోయాడు.

********************************************************************************

పాణి ఉచిత వైద్య శిబిరం పెట్టి సహాయంగా తపస్వినీని ఎంచుకొని, “తపస్వినీ, వైద్య శిబిరం నదికి అవతలి వైపు ఉన్నది. ముసలి వారికి, చిన్న పిల్లలకు, వారి తల్లులకు నీ తోడు కావాలి. తర్వాత నేనే నిన్ను ఆశ్రమం దగ్గర దింపుతాను” అని అడిగాడు పాణి.

పడవలో పొద్దుటి నించి రాత్రి వరకు అందరినీ అటు ఇటు ఒడ్డుకు చేర్చి అలసిపోయిన ఆమెతో అతడు పడవలో తిరిగు ప్రయాణం అయినాడు. బాగా చీకటి పడిపోయిందని కంగారూ పడుతున్న ఆమెను మాటల్లో దింపటానికి  పడవ నడుపుతున్న అతడు ” ఇంత సహాయం చేసిన నాకు మీరు బహుమతిగా ఏమి ఇవ్వలేదు” అన్నాడు.

“అంత ధైర్యంగా బహుమతి అడుగుతున్నారు, అసలు మీరు నాకేం చేశారని”? అన్నది ఆమె నిర్లక్ష్యంగా, అతడిని ఆట పట్టించటానికి.

అతడు ఒక్క సారి తెడ్డు వదిలేసి, పడవను ఒక్క కుదుపు కుదిపాడు. ఆమె భయ పడి కెవ్వు మంటూ అతడిని గట్టిగా హత్తుకున్నది.

అతడికి వెన్నులోంచి పాము ఏదో సర్రున తల్లోకి పాకినట్లు అనిపించి తిరిగి కోలుకొని ” బహుమతి అంటే ఇది కాదు” అన్నాడు.

ఆమె వెనక్కి జరిగి సర్దుకొని ” నీకు సహాయం కోసం వచ్చినందుకు నన్నే భయ పెడతావా?” అని అలిగి కూర్చున్నది.

ఇంతలో తెడ్డు తీసుకొని పడవను ఒడ్డుకు చేర్చాడు పాణీ. ఆమె మౌనంగా నడుస్తూ ముందుకు వెళ్లిపోతుంటే ” నీ మౌనన్ని బహుమతిగా ఇస్తావా? ఇది మరీ అన్యాయం ” అన్నాడు ఇంకొంచెం ఆమెను ఉడికిస్తూ.

ఆమె ఆగి ఒక్క చూపు సూటిగా అతడిని చూసి ఆశ్రమం లోకి వెళ్ళిపోయింది.

***********************************************************************************

అందరికీ వీడ్కోలు చెప్పి బస్ స్టాప్కి  బయలు దేరింది తపస్వినీ. ఆమె కోసం వెళ్ళిన పాణి అప్పటికే వెళ్ళిపోయింది అని తెల్సి పరుగున ఆమెను చేరుకున్నాడు.

తపస్వినీ చిన్న మాంకును తోడు గా తీస్కోని వెళుతోంది అని తెల్సి, ” నీకు ఈ పిల్లాడు ఎలా తోడు ఉంటాడు అనుకున్నావు”? అని అడిగాడు చిరుకోపంతో.

” మరి నాకు చిన్న పిల్లలకు ఏం కావాలో ఎలా తెలుస్తుంది, ఏదో సాధించాలీ… అని ఉంది, కానీ ఎలా సాధించాలో నాకు ఎవరు చెప్తారు. …? పేరుకి చిన్న మాంకు అయినా, నా కన్నా ఎక్కువ సేవ చేశాడు, ఆ అనుభవం నాకు కావాలి ”  అన్నది.

అతడు నన్నెందుకు అడగలేదు తపస్వినీ అని సందేహిస్తుండగా, ఆమె ఏదో గుర్తుకు చేసుకొని సంచిలో నించి ఒక చిన్న గాజు సీసా అతడి చేతిలో పెట్టి ” బహుమతి అడిగారు కదా! తీసుకోండి ‘మొదటి స్వాతి చినుకులు’, మీకు ఇష్టం అని చిన్న మాంకు చెప్పాడు” అన్నది.

చిన్న మాంకు అతడిని కొంచెం వంగమని చెప్పి అతడి చెవిలో ” ఇంత శ్రద్ధ చూపేది ఎవరో తెలుసా?” అన్నాడు వారి భాషలో.

వీరిద్దరి మాటలు అర్థం కానీ ఆమె విచిత్రంగా చూస్తుంటే, మారు ఆలోచించకుండా అతడు చప్పున బస్ ఎక్కాడు వారికి తోడుగా.

**********************************************************************************

ఆశ్రమం స్థలంలో చిన్న టెంట్ హౌస్ వేసుకొని ఆశ్రమం కట్టడం ప్రారంభించారు వారు. ఆమె అన్న ఎమ్యూస్స్మెంట్ పార్క్, ఆమె ఆశ్రమం ఒకే సారి పూర్తి అయినవి. తపస్వినీ ఆశ్రమం గూర్చి తెల్సిన రిషి బిజినెస్ పార్ట్నర్ సౌరభ్ ఆమెను ఆరాధిస్తున్నాడు.

“ఎలాగైనా ఆమెను ఇచ్చి పెళ్ళి చేయమని రిషిని కోరటంతో ” తప్పకుండా” అని మాట ఇచ్చి తపస్వినికి విషయం చెప్పాడు.

” నీ అభిప్రాయాలు నచ్చి చేసుకుoటున్నాడు, ఇక నా లాగా నీకు అడ్డు పడడు, పైగా ఆశ్రమానికి చేయూతని ఇస్తాడు.  ఆలోచించుకో.” అని చెప్పగా వారిద్దరిని ఆశ్రమ ప్రారంభోత్సవానికి పిలిచింది.

ప్రారంభోత్సవ వేడుకల్లో సౌరభ్ తానే స్వయంగా ఆమెను ప్రపోస్ చేసి, ఆశ్రమ పిల్లల పోషణ భారం చూసుకుంటానని భరోసా ఇచ్చాడు.

అప్పటి దాకా అన్న మీద ఉన్న ఛీత్కార భావనతో అతడి పార్ట్నర్ సౌరభ్ కూడా అంతే అనుకున్న ఆమె అతడి మంచి మనస్సు గూర్చి, ఆశ్రమ భవిషత్తు గూర్చి ఆలోచనలో పడింది.

ఇది తెలియని పాణి ఊరిలో తనకు మిగిలిన ఒకే ఒక్క ఇల్లును కూడా అమ్మకం పెట్టాడు, ఆశ్రమ పిల్లల చదువు కోసం.

అన్నీ విషయాలను భాష రాక పోయినా అర్థం చేసుకున్న చిన్న మాంకు ” తన చిట్టి చిట్టి కళ్ళను తుడుచుకొని, ” నేను వచ్చిన పని అయిపోయింది, ఇక మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను” అని ఆమెను అడిగాడు.

ఆమెకు అతడి బాధ తెలియక మౌనంగా ఉండిపోయింది.

వెంటనే చిన్న మాంకు  ఇల్లు అమ్మకం బేరాలు ఆడుతున్న పాణికి ఆపేయమని చెప్పాడు. కానీ అతడు “ఆశ్రమం పెట్టి వదిలేస్తే పోషణ, చదువు ఎవరు చూస్తారు” అంటూ వారించాడు.

సరిగ్గా అదే సమయానికి తపస్వినీ  చెక్కు తీసుకొని వచ్చి “సమయానికి ఆదుకున్నారు, కాలం కలిసి వచ్చింది, మీ డబ్బులు మీకు తిరిగి ఇవ్వగలుగుతున్నాను” అన్నది అతడి చేతిలో పెడుతూ.

పాణి చిన్న మాంకును చూశాడు.చిన్న మాంకు ఆమె వెనక ఉన్న సౌరభ్ ను చూశాడు.పాణికి విషయం అర్థం అయింది.

******************************************************************************

పాణి అందరికీ వీడ్కోలు చెప్పి తన ఊరికి బయలు దేరాడు, చిన్న మాంకును తనతో ఉండి పోమ్మని తపస్వినీ అడిగినా అతడు మౌనంగా పాణి చేయి పట్టుకొని ముందుకు కదిలాడు.

వారితో పాటు బస్ స్టాప్ కు చేరుకున్న ఆమెకు పాణి  ‘స్వాతి చినుకుల గాజు సీసాను’ తిరిగి ఇచ్చేస్తూ ” ఇది సౌరభ్ ఆఫీసులో ఉంటే  మరింత అందంగా ఉంటుంది, ఇవ్వండి” అన్నాడు.

ఆమె “తప్పకుండా అందజేస్తాను” అని తీసుకున్నాక చిన్న మాంకు ఆమెకు ఒక బుక్ ఇచ్చి బస్ ఎక్కాడు ఉబికి వస్తున్న బాధను కప్పి పుచ్చుతూ.

************************************************************************************

ఇంటికి తిరిగి వచ్చిన తపస్వినీ చిన్న మాంకు ఇచ్చిన పుస్తకం తెరిచి చూసింది.

అది ఒక కధను వివరిస్తున్న చిత్రాల సమాహారం.

మొదటి పేజీ : ఒక చెట్టు కింద తడిసి పోయి బిక్కు బిక్కు మంటూ చూస్తున్న ఒక చిన్న మేక పిల్ల

రెండవ పేజీ: ఒక వ్యక్తి తన రెండు చేతులు చాపి సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్నాడు, ముంజేతి మీద పావురం చక్కిలిగిలి పెడుతోంది.

మూడవ పేజీ: స్వాతి చినుకులు సంగ్రహిస్తున్న చిన్న పాప.

నాలగవే పేజీ: ఒక అమ్మాయిని, ఒక అబ్బాయి హింసిస్తున్న చిత్రం

అయిదవ పేజీ: పడవ కుదుపుకి అమ్మాయి, అబ్బాయిని హత్తుకున్న దృశ్యం

చివరి పేజీ: 100 ఆవులున్న  వ్యక్తి చెట్టు కింద తడిసి ఉన్న మేక పిల్లను, దాని యజమానికి తనకున్న  ఆవులలో ఒక  ఆవుని బదులుగా ఇచ్చి  తీసుకెళుతుంటే, ఒక బీద వాడు తనకున్న ఒకే ఒక్క ఆవుని ఇచ్చి మేక పిల్లను తీసుకెళదామని వచ్చి, నిరాశగా తిరిగి వెళుతున్నాడు.

పుస్తకం మూసేసిన తపస్వినీ మౌనంగా గోడ మీద ఉన్న తన తల్లి ఫోటోను చూసింది.

తుఫాను గాలికి వేగంగా కిటికీ రెక్కలు తెరుచుకున్నాయి.. .పుస్తకంలో పేజీలు రెప రెప లాడాయి.

***********************************************************************

పాణి తన కుటీరానికి చేరుకున్నాడు, తన ఇల్లు ఇపుడు వెల వెల పోతున్నట్లు కనిపించింది అతడికి. అంతలోనే అంతకు ముందు కుదిరిన బేరగాళ్ళు ఫోన్ చేశారు ఇంట్లోకి ప్రవేశించగానే.

అతడు చాలా చిరాగ్గా ఫోన్ రిసీవ్ చేసుకొని ” చెప్పాను కదా అమ్మేస్తానని, ఎన్ని సార్లు చెప్పాలి ” అని అరిచాడు.

అవతలి వారు ” లేదండీ, ఈ కుటీరం అమ్మితే ఊరుకోను, భార్యకు తెలీకుండా భర్త దగ్గర ఇల్లు కొనుగోలు చేయటం నేరం అని తపస్వినీ గారు  అడ్డు పడ్డారు” అన్నాడు.

ఆశ్చర్యపోయిన అతడు ఫోను సోఫాలోకి విసిరి సూర్యుడికి థాంక్స్ చెప్పాలని పెరట్లోకీ పరిగెట్టాడు.

అక్కడ ప్రశాంతమయిన వదనంతో తపస్వినీ తన రండు చేతులను సమాంతరంగా చాపి సాయం సంఝా కిరణాలను ఆస్వాదిస్తుంటే, ఆమె ముంజేతి మీద వాలిన తెల్లని పావురాన్ని తీసి ఎగరేసి  పాణి చక్కిలిగింతలు పెట్టాడు.

ఆమె చిన్నగా కళ్ళు మూసుకొనే నవ్వింది, చిన్న మాంకు మరలా తన చిట్టి కళ్ళను మరింత చిన్నవి చేసుకొని నవ్వి,  సిగ్గు పడుతూ గోడ చాటున నక్కాడు.

************************************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a comment